మాఘపురాణం -14వ అధ్యాయము

బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట

ఓ దిలీపుడా! మాఘమాసములో స్నానమాచరించుట వల్ల కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వింటివి కదా! అటులనే విప్రకన్య తన భర్తతో ఎటుల విష్ణు సాయుజ్యమును పొందెనో వివరింతును సావధానుడవై ఆలకింపుము. 
పూర్వకాలమందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామములో సుబుద్ధి యను బ్రాహ్మణుడు కలదు. అతడు నాలుగు వేదములు చదివి అర్థ తాత్పర్యసహితముగా వర్ణించగల పండితుడు. చదువునందెటుల పాండిత్యము గలదో బుద్ధియందును పేరుకు తగినటులే పెద్దలను గౌరవించుట, భూతదయ గలిగి, అందరి మన్ననలను పొంది యుండెను. అతడు గొప్ప పండితుడగుట వల్ల అనేకమంది ఇతర పండితులు అతనివద్దకు జేరి శిష్యులైరి. ఆ బ్రాహ్మణునకు పడి సంవత్సరముల బాలికామణి కలదు. ఆమె పేరు సుశీల. 
ఆ బాలిక కడు రూపవతి. సుగుణాల రాశి, అందాలభరిణ. లేడి కన్నులవలె చక్కటి నయనాలు గలది. నిండు చంద్రుని వంటిముఖము కలది. తుమ్మెద రెక్కలను పోలు నల్లని పొడుగాటి తలవెంట్రుకలు కలదు. ఆమె నడచిన యెడల హంస నడకను మరిపించు నడక గలది. అందమైన ముఖవర్చస్సు గలది. కోకిల కంఠము కలది ఆ సుందరాంగి ముక్కు, పండ్లవరుస చూచిన వారికి మరల మరల చూడవలయునను కోరిక పుట్టును. అటువంటి సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెండ్లి చేతునాయని తండ్రి సుబుద్ధి ఆలోచించుచుండెను. 
ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి ఇంట జరుగు దైవకార్యమునకు పూజాద్రవ్యములను తెచ్చుటకై అడవికి బయలుదేరి వెళ్ళుచుండగా- దారిలోనున్న ఉద్యానవనములో సుశీల తన స్నేహితురాండ్రతో బంతులాట ఆడుకొనుచుండెను. ఆ బంతి బైటకుపడినందున బంతి తెచ్చుటకు తోట వెలుపలకు సుశీల వచ్చి సుమిత్రుని చూచినది. 
సుమిత్రుడు కూడా యుక్తవయస్సులో నున్నాడు. చక్కటి అవయవ సౌష్టవం కలవాడు. విశాలమైన వక్షము కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు. అతని అందమును సుశీల చూడగానే నివ్వెరపోయింది. అతనిని తదేక దృష్టితో చూచి అతని వెంటబడింది. సుమిత్రుడు తన కార్యము కొలది చాలా దూరమేగెను. అలా కొంత దూరమేగుసరికి ఒక కోనేరు కనిపించెను. ఆ కోనేరు నిండా తామరపువ్వులు విరబూసి ఉన్నాయి. 
తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును గ్రోలుచు మత్తెక్కి ఎగురుచున్నవి. అచ్చటనున్న వివిధ ఫల వృక్షాలు పువ్వులతోను, పండ్లతోను నిండివున్నాయి. కోయిలలు తమ మధుర కంఠాలను విప్పి కూయుచున్నవి. మగనెమళ్ళు ఆడ నెమళ్ళకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమ తమ పింఛములను విప్పి నాట్యమాడుచున్నవి. నీటి జంతువులూ తామర తూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకెగిరిపడుతూ నీటిలో ఈడుచున్నవి. సుమిత్రుడు దూరంనుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు గ్రోలి చెట్లనీడను విశ్రమించి యుండెను. వెనుకనుండి వచ్చిన సుశీల అచటి ప్రకృతి రమణీయతను చూచి మల్లె, జాజి, సంపెంగ పూవులా వాసనలకు మన్మధ చేష్టలతో మత్తెక్కినదై చెట్లక్రింద విశ్రమించి యున్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలవడినది. సుమిత్రుని సౌందర్యమును కనులార చూచి చలించిపోయినది. ఇక తానే సుమిత్రుని పలకరించినది. “ఓ అందగాడా! సుమిత్రా! నిన్ను చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనంలో లేదు. అందుకే నీ వెనుక ఇంతదూరం వచ్చితిని. ఈ ఏకాంత ప్రదేశమున నన్ను కౌగిలించుకొని నాతొ కూడుము. నీ వయసు, నా వయసు సరిసమానము. ఇద్దరమూ ఏరికూర్చిన జంటవలె నున్నాము. చిలకా గోరింకల వలెను, రతీ మన్మధులవలెను, లీనమై పోవుదము. ఆ చెట్టుపై వున్నా గువ్వలజంటలను చూడు. మధువును త్రాగి మత్తెక్కిన ఆ తుమ్మెదల జంటల చూడు ఏలాగున్నవో! కాన రమ్ము నా యవ్వన బింకాన్ని ఆఘ్రాణించుము. సమయమును జారవిడువకుము. నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములగు అవయవములను నీకర్పింతును. నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగలించుకో” అని అనేక విధాల ఆ విప్రకుమారుని తొందర పెట్టసాగెను.
అంత సుమిత్రుడు నిశ్చేష్టుడై నోటమాట రాక శిలావిగ్రహము వలెను, కొంతసేపైన తరువాత బాలా! నీమాటలు చూడ పిచ్చిదాని వలె నున్నావు. నీకేదైనా గ్రహము ఆవరించినదా? అని సందేహం కల్గుచున్నది.
అదియుగాక నీవు ణా గురువు కుమార్తెవు. నేను నీకు అన్ననగుదును. నీవు నాకు చెల్లివంటి దానవు. నీ మనసును నీవు స్వాధీనము చేసుకోలేని స్థితిలో నున్నావు. నీవెంతటి అందగత్తె వాయినాను హద్దుమీరి ప్రవర్తించుట భారతనారికి తగదు. అదిగాక నీవు విద్యావటివి, పుణ్యవతివి గాన నీ ప్రయత్నమును మానుకోనుము. నీకు కష్టములెదురౌను. వావి వరస లేక మన్మధాగ్నికి బలియై మనమిద్దరమూ సంభోగించిన ఆ మహాపాతకము సూర్య చంద్రాదులు వున్నతవరకు మనమెన్ని జన్మలెత్తినను, ఏయే జన్మలెత్తినను, మనలను వెంటాడుచునే ఉండును. ఆ నరకబాధలనుండి మనమెన్నటికిని విముక్తినొందజాలము. గాన నీకోరిక నంగీకరింప జాలను. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినటుల గురువర్యులకు తెలిసినచో నిన్ను దండింతురు గాన రమ్ము. ఫలములు, కుశలు, పుష్పములు మొదలను పూజాద్రవ్యములను దోడ్కొని పోవుదము” అని సుమిత్రుడు అనేక విధాల బోధించాడు.
అంత నా కన్యయు, బంగారం, రత్నము, విద్య, అమృతము తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించు వాడు మూర్ఖుడు గాని వివేకవంతుడు గాదు. నానిండు యవ్వనాన్ని, నా శరీరాన్ని సమస్తమును నీకర్పింతునాన్న నిరాకరించుచున్నావు గదా! సరే నేనిక వంటరిగా నా గృహమునకు పోజాలను. నేనిందే ప్రాణత్యాగ మొనర్చుకొందును. నీవలన ఒక కన్య చనిపోయినదని నలుగురూ నిన్ను ఆదిపోసుకొందురు. నన్నొంటరిగా యీ కారడవిలో వదలి ఇల్లు చేరినయెడల నా దండ్రి నిన్ను విడుచునా? నా కుమార్తె ఏదియని నిన్ను దండించడా? ఈ పాటికి ణా చెలికత్తెలు నీతో అడవికి పోయెనని చెప్పియేయుందురు. గాన నేను కామబాధ భరించలేకున్నాను. నాతో సంభోగింపుము. నన్ను నీదానను జేసికోనుము” అని పలికెను.
సుమిత్రుడు ఆమె దీనాలాపము లాలకించి సంకట స్థితిలో పడెను. కొంత తడవు ఆలోచించి, ఆ బ్రాహ్మణ కన్యతో రతీక్రీడల దేలుటకై నిశ్చయించుకొనెను. శాంకరీ! ఈవిధముగా వారిరువురునూ ఆ తటాక సమీపమందొక ప్రదేశమును శుభ్రము చేసి, అందు మెత్తని పత్రములు, నానా విధ సువాసనలు వెదజల్లు పుష్పముల బరచి ప్రక్రుతి సౌందర్యములను జూచి మురిసిపోయి కామతృష్ణ దీర్చుకొని, మరికొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులిడుచూ ఆడుకొనిరి. వారికామ వికారములను చూచి, పక్షులు సిగ్గుపడి అచ్చోటి నుండి ఎగిరిపోయినవి. సాధుజంతువులు మొగములు ముడుచుకొని అచటినుండి కదలిపోయినవి. కొలనులోని కాలువలు మెడవంచినట్లు – నీళ్ళలో వంగిపోయినవి. సూర్యుడు మబ్బు చాటున దాగుచున్నాడు. మాటిమాటికీ వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధువు గ్రోలి మత్తెక్కియున్న తుమ్మెదలు గూడ సిగ్గుపడినవి. ఈవిధంగా వారు ఉల్లాసంగా కొంత తడవు వుండి సమత్కుశ పుష్పములు, నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటిముఖం పట్టి ఇల్లు జేరిరి. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజాద్రవ్యములు సమర్పించెను. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను జూచి “సుశీలా! నీవు ఉద్యానవనంలోని చెలులతో బంతులాటలాది అలసిపోయి వున్నావు. పాపము! ఎండకు నీ సుకుమార ముఖారవిందము ఎటుల వాడిపోయి ఉన్నదో కదా! రమ్ము ఈ మధుర పదార్థములను భుజించి కొంత తడవు విశ్రమింపుము. ఆటలాడు కొనుట వలన నీవు ధరించి ఉడుపులు కూడా నలిగియున్నవి. అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించెను. ఆమె లోలోన బెదురూ పైకి ఏమియు ఎరుగని దానివలె నాటించెను. మరి కొంతకాలములకు సుశీలను హిమాలయ ప్రాంత వాసియగు బ్రాహ్మణుడొకడు పెండ్లియాడి అత్తవారింటనే వుండిపోయెను. 
మరికొంతకాలమునకు సుశీలను పెండ్లియాడిన బ్రాహ్మణుడు పరలోక గతుడయ్యెను. భర్త శవముపై బడి సుశీల ఏడ్చుచున్నది. చాలా దుఃఖించెను. నవయవ్వనవతి, సౌందర్యవతి యగు తన కుమార్తెకు అకాల వైధవ్యము కలిగెను కదా! అని గొల్లుమని ఆడదాని వలె తండ్రి ఏడ్చుచుండెను. “ఓయీ భగవంతుడా! చిన్నవయసునందే ఇంకనూ సంసార సుఖమన్నది అనుభవించకనే ఈమెను విధవరాలను చేసితివా? తండ్రి దీనికాలమెట్లు తీరును? ప్రజలు విధవను జూచిన యెడల అమంగళకారమని భావింతురే! ఏ శుభ కార్యములయందును పాల్గొననివ్వరు కదా! దీనికి కర్మ నేలా కలిగించితివి!”అని పరిపరి విధములుగ దుఃఖించెను. అంతలో అచ్చోటికి ఒక సిద్ధపురుషుడు భిక్షాటనకై వచ్చెను. ఆ సమీపమునందే ఒక మూల ఏడుపులు వినబడుచున్నందున శవమున్న చోటకు వెళ్ళి సుబుద్ధితో – “ఆర్యా! మీరు దుఃఖించుటకు కారణమేమి? త్వరగా చెప్పుడు” అని పలికెను. 
అంతట సుబుద్ధి సిద్ధ పురుషునితో స్వామీ! మా దుఃఖం గురించి ఏమని చెప్పుకొందును. మీ తేజస్సు చూచుటవలన కొంత ఉపశమనం కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. ఆ చనిపోయిన వాడు ఆమె భర్త. వివాహమైన కొలది దినములకే ఈతడు చనిపోయినాడు. మాకు ఈమె తప్ప మరెవ్వరునూ లేరు. చిన్నతనములోనే ఈమెకు కల్గిన వైధవ్యమును చూడలేక మా హృదయములు బ్రద్దలగుచున్నవి. ఇదియే మా దుఃఖానికి కారణం. ఈమెకీ దుస్థితి ఎందుకు కలిగెనో ఈమె పూర్వజన్మ మెటువంటిదో మీకు తెలిసియున్న యెడల సెలవిండు” అని వేడుకొనెను. 
సిద్ధుడు కొంతతడవు తన దివ్యదృష్టిచే అంతా గ్రహించి “విప్రవర్యా! నీకుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా వుండేది. ఈమె కామాతురత గలదగుటచే కొంతమంది పరపురుష సంపర్కము కలిగివుండి తన భర్త నిద్రలో నుండగా అర్థరాత్రి నిశా సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిల తన్నుకొని ప్రాణములు విడచెను. ఆ రక్తపాతము భయానక దృశ్యము చూచి ఆమె భయపడి తానుకూడా ఆ కరవాలముతో పొడుచుకొని చనిపోయినది. అటువంటి ఘోరహత్యచేసి ఈజన్మలో నీ కుమార్తెగా పుట్టినది. ఆమె చేసియున్న దోషము వల్లనే నీ అల్లుడు చనిపోయాడు. ఆమెకు చుట్టుకున్న పాతకముల వలననే విధవరాలైనది. అంతటి పాపత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతము గూడ వివరించెదను వినుము.
చాలా సంవత్సరాల క్రిందట అనగా – నీ కుమార్తెయొక్క పదునాల్గు జన్మల వెనుక మాఘమాసంలో సూర్య భగవానుడు మకరరాశి యందుండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలసి యమునానదీ తీరమునకు బోయి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను జేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయుచుండిరి. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలో నీకుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనుట వల్ల ఆ వచ్చిన పుణ్య ఫలంచేతనే నీవంశంలో నీకు కుమార్తెగా పుట్టినది. అయిననేమి? నీ శిష్యునితో రహస్యంగా అడవికిపోయి తన కామవాంఛ కొరకు అతనితో రమించినది. అందువలననే యీ వైధవ్యం కలిగినది. పూర్వ జన్మవలన పవిత్రమైన నీ యింత పుట్టిననూ ఘోరపాపం చేసివున్నందున తన మగనిని పోగొట్టుకొని విధవరాలైనది. కనుక పూర్వ జన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వలననే కుమార్తెకు అకాల వైధవ్యం కలిగినది. 
ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది? కానున్నది కాకమానదు. మనుష్యుడు తానూ చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైననూ అనుభవించవలసినదే కదా! దేవతలకైనను కష్టములు తప్పవు” అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి “హరిహరీ! నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది. పూర్వజన్మలో యీ నాకుమార్తె తన భర్తను హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకొన్నది. సరే ఈ జన్మలో కూడా కన్యగా వుండి నాకు కుమారునితో సమానుడు, తనకు సోదరుడు లాంటి వాడని గ్రహించక నా శిష్యునితో కూడినదా! ఆహా! ఎంతటి ఘోరము?” అని మనసులో విచారించి ఆ సిద్ధుని జూచి “స్వామీ! మీ పలుకులాలకించినది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము మరియొకవైపు ప్రేమ కలుగుచున్నవి. గాన కుమార్తె పాపమునుండి ఎటుల విముక్తురాలగునో తిరిగి ణా అల్లుడు ఎటుల పునర్జీవితుడగునో మీరు వినిపించ వలసినదిగా కోరుతున్నాను” అని పలికెను.
ఓ సుబుద్దీ! నీకుమార్తె గురించి నీవడగక పోయినా తన్నివారణోపాయం వివరించవలయుననియే నేను యిలా వచ్చినాను. ఈ మాఘ మాసంలో నీ కుమార్తె చేత నదిలో గాని, చెరువులోగాని, సూర్యోదయం కాగానే స్నానం చేయించి అచటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తయిదువులతో కలసి ధూపదీప నైవేద్యములిచ్చి పూజలు చేయించుము. ఈవిధంగా మాఘమాసమంతయు నీకుమార్తె చేత చేయించిన యెడల ఆమెకున్న పంచమహా పాపాలన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును.
మాఘ శుద్ధ విదియనాడు ముత్తయిదువుల పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయవలెను. రెండు క్రొత్త చేతలు తెచ్చి అందొక చేతలో చీర, రవికల గుడ్డ, పసుపుకుంకుమ, పండ్లు, తమలపాకులు, వక్కలు దక్షిణ పెట్టి దానిపై రెండవచేట మూతవేసి ఆ ముత్తైదువునకు సంతుష్టిగా భోజనం పెట్టి సంతోష పెట్టవలయును. ఆ విధంగా చేసినయెడల పరపురుష సాంగత్యం వలన కలిగిన దోషము నివారణ యగును.
కొంతమంది పురుషులు ఉదయముననే నదికిపోయి స్నానం చేయవలయునన్న అయిష్టత చూపుదురు గాన, అట్టివారల భార్యలయినను వారిని ప్రోత్సాహపరచి వారుకూడా నిష్ఠతో మాఘమాస స్నానములు చేయవలయును. వంశాభివృద్ధికి గాని, కుటుంబ గౌరవానికి గాని, స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానం తప్పక స్త్రీ ఆచరించవలెను. ఈ మాఘమాసమంతయు పురాణములు చదివి హరికథలు గాని, హరినామ కీర్తనలు గాని ఆలకించుచు, దానధర్మములు చేసినయెడల దానికన్న ఫలితం మరొక ఏ వ్రతమందునూ కలుగదు. మునిసత్తములు మాఘమాస స్నానములు చేసి తపస్సు చేసుకొన్నచో వారు సిద్ధులగుదురు. మతిలేని వారలచే మాఘస్నానములు విడువక చేయించిన యెడల వారిపిచ్చి కుదురును. 
కుష్ఠు వ్యాధితో బాధపడు వారలు మాఘస్నానములు చేసిన వారికి రోగ నివృత్తియగుటయే గాక మంచి పుణ్యాత్ములగుదురు. స్త్రీగాని, పురుషుడు గాని మాఘ మాస స్నానములు డాంబికముతో నలుగురు చూచి పొగుడుతున్నట్లుగా గాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము, సూర్య నమస్కారములు, పురాణములు చదువుట, హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయవలయును మాఘమాస స్నానములు చేయుచున్నానని తన్ను తాను పొగడుకొనరాదు. అటుల చేసిన “చిత్తశుద్దిలేని శివపూజలేలరా” అనురీతిగా నిష్ప్రయోజనములగును. అని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడుపదేశించెను.
ఓ శాంకరీ! ఆవిధముగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘ స్నానములు ఆచరింపజేసి దాన పుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్రమేల్కాంచిన వానివలె లేచి జరిగిన వృత్తాంతమును విని తానుకూడా తన భార్యతో పుణ్య కార్యములను చేసి పాపరహితుడయ్యెను.

చిత్రంలోని అంశాలు: 2 మంది వ్యక్తులు