కార్తీకపురాణం - 19 వ అధ్యాయం

_*కార్తీకపురాణం - 19 వ అధ్యాయం :*_

???????????

_*చతుర్మాస్య వ్రత ప్రభావం*_

☘?☘?☘?☘?☘?☘

నైమిశారణ్యంలో మునులంతా కలిసి చిదానందుని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి ”ఓ దీనబాంధవా! వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రాలుగా ఉన్నవాడివని, సర్వాంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వతా పూజలందుకునే వాడివని, సర్వాంతర్యామివని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుతున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణకోటికి ఆధారభూతడవైన ఓ నందనందనా… మా స్వాగతం స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలు అన్నీ పవిత్రాలయ్యాయి. ఓ దయామయా! మేం ఈ సంసార బంధం నుంచి బయటపడలేకున్నాం. మమ్మల్ని ఉద్దరింపుము. మానవుడెన్ని పురాణాలు చదివినా… ఎన్ని శాస్త్రాలను విన్నా… నీ దివ్య దర్శనం దొరకజాలదు. నీ భక్తులకు మాత్రమే నీవు కనిపిస్తావు. ఓ గజేంద్ర రక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! నన్ను కాపాడుము” అని మైమరచి స్తోత్రము చేయడగా… శ్రీహరి చిరునవ్వుతో…. ”జ్ఞానసిద్ధా! నీ స్తోత్ర వచనానికి నేనెంతో సంతోషించాను. నీకు ఇష్టమైన ఒక వరం కోరుకో” అని పలికెను. అంతట జ్ఞాన సిద్ధుడు ”ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరం నుంచి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగలా కొట్టుకుంటున్నాను. కాబట్టి నీ పాదపద్మాలపై ధ్యానముండేట్లు అనుగ్రహించు. మరేదీ నాకు అవసరం లేదు” అని వేడుకొన్నాడు. అంతట శ్రీమన్నారాయణుడు ”ఓ జ్ఞాన సిద్ధుడా! నీ కోరిక ప్రకారం వరమిస్తున్నాను. అదేకాకుండా, మరో వరం కోరుకో… ఇస్తాను. ఈ లోకంలో అనేకమంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలుచేస్తున్నారు. అలాంటివారి పాపాలు పోవడానికి ఒక వ్రతం కల్పిస్తున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించొచ్చు. సావధానుడవై ఆలకించు…. నేను ఆషాఢ శుద్ధ దశిమిరోజున లక్ష్మీసమేతంగా పాలసముద్రంలో శేషశయ్యపై పవళిస్తాను. తిరిగి కార్తీకమాసం శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు అమిత ఇష్టమైనవి. చాతుర్మాస్యాల్లో ఎలాంటి వ్రతాలు చేయనివారు నరక కూపాలలో పడతారు. ఇతరులతో కూడా ఈ వ్రతాన్ని ఆచరింపజేయాలి. దీని మహత్యాన్ని తెలుసుకో. వ్రతం చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి. ఇక చాతుర్మాస్య వ్రతం చేసేవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమంగా ఆషాఢ శుద్ధ దశిమి మొదలు శాఖములు (కూరలు), శ్రావణ శుద్ధ దశిమి మొదలు పప్పుదినుసులు విసర్జించాలి. నాయందు భక్తిగలవారిని పరీక్షించడానికి నేను ఇలా ద్రవ్యాల నిషేధాన్ని విధించాను. ఆ కాలంలో నేను ఆయా ద్రవ్యజాల్లో శయనిస్తాను. నీను ఇప్పుడు నన్ను స్తుతించిన తీరున త్రిసంధ్యల్లో భక్తిశ్రద్ధలతో పఠించేవారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు” అని శ్రీమన్నారాయణుడు తెలిపాడు. అనంతరం ఆయన మహాలక్ష్మితో కలిసి పాలసముద్రానికి వెళ్లి, శేషపాన్పుపై పవళించాడు.
తిరిగి వశిష్టుడు జనకమహారాజుతో ఇలా అంటున్నాడు… ”ఓ రాజా! ఈ విధంగా విష్ణుమూర్తి, జ్ఞాన సిద్ధుడు, మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యాన్ని ఉపదేశించాడు. ఈ వృత్తాంతాన్ని ఆంగీరసుడు ధనలోభునికి తెలియజేశాడు. నేను నీకు వివరించాను. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి స్త్రీపురుష బేధం లేదు. అన్ని జాతుల వారు ఈ వ్రతాన్ని ఆచరించొచ్చు. శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారం మునిపుంగవులంతా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి, ధన్యులయ్యారు. అనంతరం వైకుంఠ ప్రాప్తిని పొందారు” అని వశిష్టులు చెప్పారు.

*_ఇట్లు స్కాంద పురాణాంతర్గతంలో వశిష్టుడు బోధించిన కార్తీకమహత్యం పందొమ్మిదో అధ్యాయం సమాప్తం_*
*_పందొమ్మిదోరోజు పారాయణం సమాప్తం._*